నేలతల్లిని కాపాడుకుందాం.. సుస్థిర వ్యవసాయానికి బాటలు వేద్దాం : ఏఓ సుదర్శన్ గౌడ్
కృష్ణ సూర్య న్యూస్ :
ప్రాణధార అయిన నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటేనే భవిష్యత్తులో సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్ స్పష్టం చేశారు. మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 'ఖేతీ బచావో అభియాన్' (సాగు భూమి సంరక్షణ కార్యక్రమం)లో భాగంగా గురువారం మండలంలోని తంగిడి గ్రామంలో ప్రత్యేక రైతు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నేల ఆరోగ్య పరిరక్షణ, పచ్చిరొట్ట ఎరువుల వినియోగం, వరి కొయ్యల దహనం వల్ల జరిగే నష్టాలు, ఎల్ నినో ప్రభావం - ప్రత్యామ్నాయ పంటల సాగు వంటి కీలక అంశాలపై రైతులకు అవగాహన కల్పించి వారికీ దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువులను విస్తృతంగా వినియోగించడం ద్వారా నేలలో సేంద్రియ పదార్థాల శాతాన్ని పెంచుకోవచ్చని, తద్వారా భూమి సారవంతమై అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించారు. వరి కోత తర్వాత పొలాల్లో కొయ్యలను కాల్చడం వల్ల నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పూర్తిగా నశించిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భూసారం తగ్గి పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని హెచ్చరించారు. కొయ్యలను కాల్చకుండా పొలంలోనే కలియదున్ని తగిన పద్ధతుల్లో కుళ్ళబెట్టాలని ఆయన సూచించారు.
ముఖ్యంగా ఎల్ నినో కారణంగా వర్షపాతంలో మరియు వాతావరణంలో వచ్చే మార్పులను రైతులు గమనించాలన్నారు. అందుబాటులో ఉన్న నీటి లభ్యతను బట్టి సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. రాబోయే యాసంగి సీజన్‌లో నీటిని ఆదా చేసే ఆరుతడి పంటలు, వరికి ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాల సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగప్ప, వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ) బి. అభిలాష్, ఎం. రవికుమార్ మరియు గ్రామ పెద్దలు,రైతులు , తదితరులు పాల్గొన్నారు.
నర్సిములు, సూర్య రిపోర్టర్ కృష్ణ మండలం