వరంగల్- ఖమ్మం- నల్గొండ.... పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి..
#. ఫారం- 18 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి.... #.డూప్లికేట్ ఓట్లను తిరస్కరించాలి---------అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి.
నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్...
వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటరు నమోదు దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి, అర్హులైన పట్టభద్రులకు ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గురువారం ఆయన నల్లగొండ కలెక్టర్ వరంగల్- ఖమ్మం- నల్గొండ ఆర్వో ఛాంబర్‌లో
ఉమ్మడి నల్లగొండ జిల్లాల ఈ ఆర్ వోలు, ఆర్డీవోలతో పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో నల్లగొండ జిల్లా ముందుండడం పట్ల జిల్లా కలెక్టర్ ఈ ఆర్ ఓలు,సిబ్బందిని అభినందించారు. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లోనూ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.దరఖాస్తుల పరిశీలనలో అప్రమత్తంగా ఉండాలని,
ఓటరు నమోదు కై దరఖాస్తులు అందిన వెంటనే వాటిని క్షున్నంగా పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. పట్టభద్రుల విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, ఉద్యోగుల సర్టిఫికెట్లను నిబంధనల ప్రకారం జాగ్రత్తగా పరిశీలించాలని , అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. విశ్వవిద్యాలయాల ద్వారా జారీ చేసిన డిగ్రీ ధ్రువీకరణ పత్రాలు సైతం జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పారు.ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా చూడాలని, డూప్లికేట్ ఓట్లను గుర్తించి నిబంధనల ప్రకారం తిరస్కరించాలనిస్పష్టం చేశారు. బీఎల్‌ఓలు ఓటర్ల నివాస వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, విద్యార్హతల ధ్రువీకరణను సంబంధిత అధికారులు పరిశీలించాలని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని,
ఓటర్లకు అందుబాటులో ఉండేలా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయులకు వారి నివాస ప్రాంతాలకు సమీపంలోని పోలింగ్ కేంద్రాలను కేటాయించే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. ఓటర్ల చిరునామా మార్పులకు సంబంధించిన దరఖాస్తులను కూడా నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు. ముసాయిదా ఓటరు జాబితాలోని వివరాలను, ఓటరు చీటీలను పరిశీలించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని తెలిపారు.అలాగే, ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, జంబో బ్యాలెట్ బాక్సుల లభ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏ జిల్లాలోనైనా సామగ్రి కొరత ఉంటే వెంటనే తెలియజేయాలని, అవసరమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డిటిసి లోని కంప్యూటర్ కేంద్రంలో 20 కంప్యూటర్లను ఏర్పాటు చేసి, సిబ్బందితో రెండు షిఫ్టుల్లో రాత్రింబవళ్లు దరఖాస్తుల పరిశీలన చేస్తున్నట్లు వివరించారు.
ఎంజీ యూనివర్సిటీ విద్యార్థుల సహకారం తీసుకుంటున్నామని, ఆర్డీఓ స్థాయిలో పర్యవేక్షణ చేయడం జరుగుతున్నదని తెలిపారు. రానున్న నాలుగు రోజుల్లో ఓటరు నమోదు సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.ఈ సమావేశానికి రెవిన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్, ట్రైనీ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ థియాన్ మావి, ఉమ్మడి జిల్లాల ఈ ఆర్ ఓ లు ,ఏ ఈ ఆర్ ఓ లు తహసిల్దారులు,
ఎన్నికల అధికారులు,
తదితరులు హాజరయ్యారు.