నీటిని పొదుపుగా వాడుకోవాలి వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రతి నల్లాకు ట్యాప్ బిగింపు
సదాశివపేట;రానున్న వేసవికాలం, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి వృథాను అరికట్టి, ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని సదాశివపేట మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ రేణుక చిరు ప్రజలకు సూచించారు.సదాశివపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని 3వ వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రతి నల్లాకు వాటర్ ట్యాప్‌లను బిగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రేణుక చిరు మాట్లాడుతూ వేసవికాలంలో నీటి కొరత కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా నీటి వృథాను అరికట్టేందుకు నల్లాలకు ట్యాప్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.నీటిని వృథా చేయకుండా అవసరాలకు మాత్రమే వినియోగించాలని, వాహనాలు, రోడ్లు, వాకిళ్లు కడగడానికి తాగునీటిని వృథా చేయకూడదని ఆమె సూచించారు. రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావం, వేసవిలో నీటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.త్వరలోనే సదాశివపేట పట్టణంలోని అన్ని వార్డుల్లోనూ నల్లాలకు ట్యాప్‌లు బిగించే కార్యక్రమాన్ని చేపడతామని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో భరత్, ఉదయ్, నితిన్, మాణిక్, దిలీప్, లాజర్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.