హైతాబాద్‌లో భూ వివాదం..!
హత్యాయత్నం...9 మంది నిందితులు అరెస్ట్… వాహనాలు, ఆయుధాలు స్వాధీనం
షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 24) : భూ వివాదం నేపథ్యంలో హైతాబాద్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ హత్యాయత్నంకు దారితీసింది. ఈ ఘటనలో తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం షాబాద్ పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న షాబాద్ మండలం హైతాబాద్ గ్రామంలోని సర్వే నంబర్ 202 భూమితో పాటు ఇతర భూములకు సంబంధించి దీర్ఘకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని మసీదులో చర్చల కోసం రెండు వర్గాలు సమావేశమైన సమయంలో ఘర్షణ చోటుచేసుకుంది. చాంద్ పాషా, ఆయన కుమారులు సోహెల్, ఫైజల్‌పై దాడికి ముందస్తు పథకం ప్రకారం నిందితులు రెండు కార్లు, ఓ మోటార్ సైకిల్‌పై ఆయుధాలతో వచ్చారని,ఘర్షణలో ముజఫర్ ఉద్దీన్ ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వాహనాలు ధ్వంసమయ్యాయి.
కేసులో భాగంగా పంచుల సమక్షంలో రెండు కార్లు, ఓ మోటార్ సైకిల్, రెండు క్రికెట్ బ్యాట్‌లు, ఓ కత్తి, పలు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని షాబాద్ పోలీసులు తెలిపారు.