telangana
రాజన్న గుడిలో విజిలెన్స్ సెగ
సూర్య, వేములవాడ:రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విజిలెన్స్ విచారణ తీవ్ర కలకలం రేపుతోంది. ఆలయ పరిధిలోని దుకాణాల లీజులు, లైసెన్సుల కేటాయింపుల వ్యవహారంలో జరిగినట్లుగా భావిస్తున్న అక్రమాలు, శాఖాపరమైన తప్పిదాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తొమ్మిది మంది ఆలయ ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు.
*శాఖాపరమైన తప్పిదాలపై విచారణ ముమ్మరం:*
దేవస్థానానికి ఆదాయ వనరులుగా ఉన్న షాపుల లీజులు, లైసెన్సుల పునరుద్ధరణ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ విభాగం ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ ప్రక్రియలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు, శాఖాపరమైన లోపాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు.. బాధ్యులైన సిబ్బందిని వివరణ కోరుతూ నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న వారిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (ఏఈవోలు), సూపరింటెండెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
*వ్యక్తిగత హాజరుకు ఆదేశం:*
ఈ వ్యవహారానికి సంబంధించిన రికార్డులు, కీలక ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉన్నందున, నోటీసులు పొందిన ఉద్యోగులందరూ తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని విజిలెన్స్ అధికారులు ఆదేశించారు. ఈ విచారణకు సంబంధిత ఆధారాలతో రావాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
*ఆందోళనలో దేవస్థాన సిబ్బంది:*
ఉన్నతాధికారుల నుంచి నేరుగా నోటీసులు జారీ కావడంతో వేములవాడ దేవస్థాన ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. లీజుల వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తుండటంతో, ఈ విచారణ ముగిసిన అనంతరం మరిన్ని కీలక విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.