దేవరపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీకాకుళపు కాళీకృష్ణ
దేవరపల్లి, అక్టోబర్ 24 మేజర్ న్యూస్ :మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా, తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ దేవరపల్లి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీకాకుళపు కాళీకృష్ణ స్పష్టం చేశారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ అధికారం అనేది కేవలం పదవి కోసం కాదని, ప్రజలకు సేవ చేయడానికి దొరికే ఒక గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు. దేవరపల్లి గ్రామ పంచాయతీ బాధ్యతలు తనకు అప్పగిస్తే ప్రజల భాగస్వామ్యంతో, ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందించి గ్రామాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడిపిస్తానని వెల్లడించారు.
తండ్రి ప్రజాసేవే నాకు స్ఫూర్తి:
తమ కుటుంబం 1981లో దేవరపల్లికి వచ్చిందని, అప్పటి నుంచి నేటి వరకు గ్రామ ప్రజలు తమ కుటుంబానికి అందిస్తున్న ఆదరాభిమానాలు మరువలేనివని కాళీకృష్ణ గుర్తుచేశారు. ప్రజల అపారమైన నమ్మకంతోనే తన తండ్రి గతంలో మండల ప్రెసిడెంట్‌గా ఎన్నికై ఐదేళ్లపాటు ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఆదర్శవంతమైన పాలన అందించారని తెలిపారు. తండ్రి చూపిన ప్రజాసేవ బాటనే తనకూ స్పూర్తి అని, అదే నిబద్ధతతో గ్రామ ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతోనే ముందుకు వస్తున్నట్లు చెప్పారు.
సేవా కార్యక్రమాలతోనే నిరంతర సేవ:
దేవరపల్లి గ్రామం తమ కుటుంబానికి ఎంతో ఇచ్చిందని, ఆ గ్రామానికి తిరిగి సేవ చేయడాన్ని తన నైతిక బాధ్యతగా భావిస్తున్నానని కాళీకృష్ణ తెలిపారు. ఇప్పటికే తన తండ్రి స్మారకార్థం ఒక ఎకరం భూమిని విరాళంగా ఇవ్వడంతో పాటు, యర్నగూడెంలో సుమారు రూ. 2 కోట్ల వ్యయంతో భారీ ఆలయ నిర్మాణం, దేవరపల్లి ప్రధాన కూడలిలో ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ నిర్మాణం వంటి పలు సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు.గ్రామ సర్వతోముఖాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని కాళీకృష్ణ అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయతీ బాధ్యతలు తన చేతికి వస్తే ప్రజల నిజమైన అవసరాలకు పెద్దపీట వేస్తూ, మరెన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తానని ఆయన పేర్కొన్నారు.