కడియం కూటమి లో సీట్ల చిచ్చు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంస్థానిక ఎన్నికల వేళ కడియం మండలంలో కూటమి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సీట్ల సర్దుబాటుపై స్పష్టత లేకపోవడంతో జడ్పీటీసీ, ఎంపీపీకి కీలకమైన ఎంపీటీసీ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఒకే స్థానంలో కూటమి భాగస్వామ్య పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది.
కడియం మండల జడ్పీటీసీ స్థానానికి జనసేన నుంచి రత్నం అయ్యప్ప, గెడ్డం శివ రత్న గణపతి నామినేషన్లు దాఖలు చేయగా, బీజేపీ నుంచి ఆకుల శ్రీధర్ బరిలో నిలిచారు. దీంతో జడ్పీటీసీ స్థానం జనసేనకు దక్కుతుందా? బీజేపీకి కేటాయిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు మండల ఎంపీపీ పదవికి కీలకంగా భావిస్తున్న కడియపులంక ఆరో వార్డులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ నుంచి ఎంపీపీ అభ్యర్థి బోడపాటి పుణ్యవతి, వైఎస్సార్‌సీపీ నుంచి సలాది ప్రసాద్ నామినేషన్లు దాఖలు చేయగా, జనసేన నుంచి మల్లు శివ చివరి నిమిషంలో నామినేషన్ వేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందా? లేక ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందా? అన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఆశావహులను సమన్వయం చేసి, అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయం సాధించడం కూటమి నాయకత్వానికి కీలకంగా మారింది.
జడ్పీటీసీ స్థానంపై జనసేన, బీజేపీ మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కడియపులంక ఆరో వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థుల విషయంలో ఏం జరగనుంది? అన్న అంశాలపై మండల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కూటమి నాయకత్వం తీసుకునే తుది నిర్ణయం కోసం రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.