లలిత కపిలవాయి ‘కళాప్రయాణం’ చిత్రకళా ప్రదర్శన - హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభం
పహాడీ, పిచ్వాయ్, మైసూర్, తంజావూరు సంప్రదాయ చిత్రకళల ప్రదర్శన
తెలంగాణ బ్యూరో , ప్రతినిధి : చిత్రకారిణి లలిత కపిలవాయి ఏర్పాటు చేసిన ‘కళాప్రయాణం – కళ, సంప్రదాయాలు, ఆత్మాన్వేషణతో కూడిన ప్రయాణం’ పేరుతో మూడు రోజుల చిత్రకళా ప్రదర్శన శనివారం హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమైంది. భారతీయ సంప్రదాయ చిత్రకళా వైభవాన్ని ప్రతిబింబించే ఈ ప్రదర్శనలో పహాడీ, పిచ్వాయ్, మైసూర్, తంజావూరు చిత్రకళా శైలులకు చెందిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రకారిణి లలిత కపిలవాయి ఏర్పాటు చేసిన ‘కళాప్రయాణం’ చిత్రకళా ప్రదర్శనను ప్రముఖ పహాడీ సూక్ష్మ చిత్రకళా నిపుణుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ విజయ్ శర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు డాక్టర్ కొసూరు శేషులత, జాగిల్ వ్యవస్థాపకుడు డాక్టర్ రాజ్ ఎన్. ఫణి, ప్రముఖ కాలిగ్రఫీ కళాకారుడు శ్రీ పరమేశ్వర్ రాజు తదితర ప్రముఖులు హాజరయ్యారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాకు చెందిన ప్రముఖ పహాడీ సూక్ష్మ చిత్రకళా నిపుణుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ విజయ్ శర్మ ఈ ప్రదర్శనకు క్యూరేటర్‌గా వ్యవహరించారు. ఆయన మార్గదర్శకత్వంలో లలిత కపిలవాయి పహాడీ చిత్రకళలోని ప్రత్యేక పద్ధతులు, మెళకువలను నేర్చుకుంటున్నారు. చిన్నతనం నుంచే సంగీతం, చిత్రకళపై ఆసక్తి పెంచుకున్న లలిత కపిలవాయి వివిధ సంప్రదాయ చిత్రకళా శైలులను అధ్యయనం చేస్తూ తన కళా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు, కథనాలు, రంగుల వినియోగం, చిత్రలేఖన పద్ధతులను ప్రతిబింబించేలా ఆమె రూపొందించిన చిత్రాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. పహాడీ చిత్రకళలోని బసోహ్లీ శైలి అనంతరం అభివృద్ధి చెందిన గులేర్, కాంగ్రా చిత్రకళా సంప్రదాయాల ఆధారంగా రూపొందించిన చిత్రాలు కూడా ఈ ప్రదర్శనలో ఉన్నాయి. వీటితో పాటు పిచ్వాయ్, మైసూర్, తంజావూరు చిత్రకళా శైలుల్లో రూపొందించిన చిత్రాలను సందర్శకులు వీక్షించవచ్చు. ప్రతి చిత్రకళా శైలికి ప్రత్యేకమైన చిత్రలేఖన పద్ధతులు, సాంస్కృతిక నేపథ్యం ఉన్నాయి. ఈ సందర్భంగా చిత్రకారిణి లలిత కపిలవాయి మాట్లాడుతూ, ‘‘సంప్రదాయ చిత్రకళలు గతానికి సంబంధించిన జ్ఞాపకాలు మాత్రమే కావు. తరతరాలుగా కొనసాగుతూ నేటికీ సజీవంగా ఉన్న కళారూపాలు. ఈ కళల్లోని ప్రత్యేకతను, వాటి వెనుక ఉన్న నైపుణ్యాన్ని ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో కళాప్రయాణం ప్రదర్శనను ఏర్పాటు చేశాను’’ అని తెలిపారు. వివిధ చిత్రకళా సంప్రదాయాలపై తనకున్న ఆసక్తి, వాటిని నేర్చుకునే క్రమంలో పొందిన అనుభవాలు ఈ ప్రదర్శనలో ప్రతిబింబిస్తాయని ఆమె పేర్కొన్నారు. అక్టోబర్ 25, 26 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఈ చిత్రకళా ప్రదర్శన కొనసాగనుంది. సందర్శకులకు ప్రవేశం ఉచితం.