telangana
మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సర్పంచ్ నాగరాజు యాదవ్
చౌడాపూర్, మేజర్ న్యూస్: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించడంతో పాటు కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మందిపల్ గ్రామ సర్పంచ్ నాగరాజు యాదవ్ అన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ గ్రామస్థాయిలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. చౌడాపూర్ మండల పరిధిలోని మందిపల్ గ్రామంలో భవన నిర్మాణ పనులకు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) జయసుధ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజు యాదవ్ మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది తమ కుటుంబాల సంక్షేమంతో పాటు గ్రామాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించేలా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేయడం, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం, సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు అండగా నిలవడం ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. గ్రామస్థాయిలో నిర్మించే భవనం మహిళా సంఘాల కార్యకలాపాలకు ఉపయోగపడటంతో పాటు వారి ఐక్యత, ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీపీఓ జయసుధ, మండల అభివృద్ధి అధికారి వెంకన్న గౌడ్, మండల ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ శివకుమార్, ఈసీ చంద్రశేఖర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శైలజ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ నరేష్ కుమార్, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు సంటి యాదమ్మ, ఉపసర్పంచ్ నవీన్, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రిపోర్టర్: కోస్గి విజయ్ కుమార్, చౌడపూర్, వికారాబాద్ జిల్లా.