పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం
పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం
నేరేడుచర్ల, మేజర్ న్యూస్
పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం విద్యార్థులకు పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల ఎస్‌ఐ గోపాల్ రెడ్డి విద్యార్థులకు పోలీసు శాఖ విధులు, నేర పరిశోధన, నేరాల ఛేదనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పోలీసు విధివిధానాలు, నేరాల పరిశోధన, నేరస్థులను గుర్తించే పద్ధతులు, సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యత, మహిళలు, విద్యార్థులు, బాలల రక్షణలో పోలీసు శాఖ పాత్ర గురించి ఎస్సై వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసులను త్వరితగతిన ఛేదించడంలో పోలీసులు అనుసరిస్తున్న విధానాలను విద్యార్థులకు తెలియజేశారు.అదేవిధంగా పోలీసు కమ్యూనికేషన్ వ్యవస్థ, ఫింగర్‌ప్రింట్ పరికరాల పనితీరు, నేరస్థుల డేటాబేస్ నిర్వహణ, నేర పరిశోధనలో వాటి ఉపయోగాల గురించి వివరించారు. నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించాలని,ప్రజల ధన, మాన, ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తూ, అవసరమైన సందర్భాల్లో ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఎస్‌ఐ సూచించారు. దేశం, ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించాలని, పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని,పోలీసుల విధులు, త్యాగాలు, ప్రజల భద్రత కోసం వారు చేస్తున్న సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.