దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ‘సంకల్పం’ 100 మందికి పైగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాల కోసం కొలతల సేకరణ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయం: ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
తణుకు, సూర్య న్యూస్ : దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను ఉచితంగా అందించడంతో పాటు వారు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా కృషి చేస్తున్న డాక్టర్ పి.ఎన్.ఎస్. కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కొనియాడారు. డాక్టర్ పి.ఎన్.ఎస్. కిరణ్ చారిటబుల్ ట్రస్ట్, వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం తణుకులోని సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమంలో ‘సంకల్పం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా దివ్యాంగులకు ఉచిత కృత్రిమ అవయవాల తయారీ, అమరిక కోసం అవసరమైన కొలతలను సేకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, దశాబ్దకాలంగా ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. కృత్రిమ అవయవాల పంపిణీకే పరిమితం కాకుండా దివ్యాంగులకు కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారాలు ఏర్పాటు చేసి జీవనోపాధి కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. దివ్యాంగులకు సానుభూతి కంటే స్వావలంబనకు అవసరమైన అవకాశాలు కల్పించడమే నిజమైన సేవ అని అన్నారు. కరోనా సమయంలోనూ ట్రస్ట్ అందించిన సేవలను గుర్తుచేస్తూ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో బోళ్ల సతీష్, కాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు
రిపోర్టర్. అనుకుమార్.తణుకు. ..పశ్చిమగోదావరి జిల్లా. .…