జంగారెడ్డిగూడెం అభివృద్ధికి కూటమి కృషి
జంగారెడ్డిగూడెం,మేజర్ న్యూస్ :జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేకా ఈశ్వరయ్య అన్నారు. శనివారం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ అభ్యర్థి రొంగల అనూష, 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గురుజు వెంకట ఉమామహేశ్వరి విజయాన్ని కాంక్షిస్తూ కూటమి నాయకులతో కలిసి వార్డులో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు. మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపితే జంగారెడ్డిగూడెం అభివృద్ధికి మరింత కృషి చేస్తామని తెలిపారు.
పట్టణంలో దీర్ఘకాలంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారానికి సుమారు రూ.100 కోట్లతో ఐదు ప్రాంతాల్లో మెగా వాటర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు వంటి పనులను చేపట్టినట్లు వివరించారు. అలాగే ప్రతి వీధిలో సిమెంట్ రోడ్ల నిర్మాణంతో పాటు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఆలోచించి తమ నిర్ణయం తీసుకోవాలని కోరారు.
చైర్‌పర్సన్ అభ్యర్థి రొంగల అనూషకు సైకిల్ గుర్తుపై, కౌన్సిలర్ అభ్యర్థులకు సంబంధిత ఎన్నికల గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని కూటమి నాయకులు ప్రజలను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పట్టణ అధ్యక్షుడు కొండరెడ్డి కిషోర్, షేక్ పేరు, కరాటం ఉమామహేశ్వరరావు, చెరుకూరి శ్రీధర్, దాకార కృష్ణ, వాసా రామకృష్ణ, కత్తుల విష్ణు, జగత్, తూటికుంట రాము, వినూత్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.