ప్రశాంత వాతావరణంలో ముగిసిన అసిస్టెంట్ సైంటిస్ట్ పరీక్ష
సంగారెడ్డి, ; తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుల భర్తీకి శనివారం నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది. పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పాండు తనిఖీ చేసి, పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.
భద్రతా ఏర్పాట్లపై ఆరా
పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల హాజరు నమోదు, బయోమెట్రిక్ విధానం, సీసీ కెమెరాల పనితీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే అభ్యర్థులను మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారా అని పరిశీలించారు. సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించకుండా తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. అభ్యర్థులకు తాగునీరు, ప్రథమ చికిత్స సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని తనిఖీ చేశారు.
నిబంధనలు పక్కాగా అమలు చేయాలి
పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని పరీక్ష నిర్వాహకులకు అదనపు కలెక్టర్ సూచించారు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటూ తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని తెలిపారు.
150 మందికి 89 మంది హాజరు
అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్ష ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరిగింది. మొత్తం 150 మంది అభ్యర్థులకు గాను 89 మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.