స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లకు శిక్షణ శిబిరాలు ఈ నెల 25 నుంచి మునిపల్లి మండలం లింగంపల్లిలో ప్రారంభం
సంగారెడ్డి, ; స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంతోపాటు, విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు సంగారెడ్డి జిల్లాలో స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లకు బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలోని తెలంగాణ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల లో ఈ నెల 25 నుంచి రాష్ట్రస్థాయి శిక్షణాధికారుల ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నాయి.భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి వి. మాధవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శిక్షణ కార్యక్రమాన్ని రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత శిక్షణ శిబిరం అక్టోబర్ 25 నుంచి 31 వరకు, రెండో విడత నవంబర్ 1 నుంచి 7 వరకు కొనసాగనుంది. ఈ శిబిరాల్లో వివిధ జిల్లాలకు చెందిన స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు పాల్గొననున్నారు.
శిక్షణ పోస్టర్ ఆవిష్కరణ
శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్ పాండు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రెజరర్ జి. సుందర్ రావు, జిల్లా కార్యదర్శి వి. మాధవరెడ్డి, జాయింట్ సెక్రటరీ ఎం. శోభ, జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్లు చంద్రశేఖర్ గౌడ్, వందన తదితరులు పాల్గొన్నారు.