జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలి
జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలి
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేసి తొలగించిన ఓటర్లను తిరిగి నమోదు చేయాలి: కొంగరి వెంకట్ మావో
చేర్యాల: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేసి తొలగించిన ఓటర్లను తిరిగి నమోదు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్ మావో డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం చేర్యాల పాత బస్టాండ్ వద్ద ప్రజా, వృత్తి సంఘాల ఆధ్వర్యంలో జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వెంకట్ మావో మాట్లాడుతూ.. బీజేపీకి లబ్ధి చేకూర్చేలా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తూ ఓటర్లను తొలగిస్తోందని ఆరోపించారు. దీనివల్ల ప్రతిపక్షాలు బలహీనపడటంతో పాటు ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతోందని అన్నారు. ఓటు నమోదు ప్రక్రియకే పరిమితం కావాల్సిన ఎన్నికల వ్యవస్థ పౌరసత్వాన్ని నిర్ణయించే అంశాల్లో జోక్యం చేసుకుంటోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసి, ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వతంత్ర సంస్థలను నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగం, పౌర హక్కులపై దాడి చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలంతా సంఘటితమై ఉద్యమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వృత్తి సంఘాల నాయకులు బండకింది అరుణ్, రాళ్లబండి నాగరాజు, పోలోజు శ్రీహరి, సీఐటీయూ జిల్లా నాయకురాలు ఇప్పకయాల శోభ, దీనికెల కనకలక్ష్మి, కొమ్ము రాజుల ఎల్లవ్వ, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు గుండ్ర రవీందర్ (చుంచనకోట సర్పంచ్), గొర్రె శ్రీనివాస్, రైతు సంఘం పట్టణ కార్యదర్శి తుప్పతి రాజు, ముస్త్యాల ప్రభాకర్, అవాజ్ జిల్లా నాయకులు ఎండీ ఎజాస్, ఎండీ కరీం, ఎన్‌పీఆర్‌డీ చేర్యాల డివిజన్ అధ్యక్షుడు తుమ్మలపల్లి అనిల్, బోయినిమల్లేశం, ఎర్రబోసు అశోక్, బియ్య సిద్దులు తదితరులు పాల్గొన్నారు.