telangana
జనగామ గోడుకు స్పందన!
సూర్య-గోదావరిఖని:సింగరేణి బొగ్గు గనుల తవ్వకాల ప్రభావంతో సమస్యలు ఎదుర్కొంటున్న రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని జనగామ గ్రామ ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. గ్రామంలో బోర్‌వెల్ కుంగిపోయిన నేపథ్యంలో శనివారం నగర మేయర్ మహంకాళి స్వామి, రామగుండం ఏరియా-1 జిఎం డి.లలిత్ కుమార్ తో కలిసి గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుంగిన బోర్‌వెల్‌ను 24 గంటల్లోగా పునరుద్ధరించాలని, గ్రామంలోని ఇతర బోర్‌బావులకు మరమ్మతులు చేపట్టాలని, నిలిచిపోయిన నల్లాల ద్వారా తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని సింగరేణి అధికారులను మేయర్ సూచించారు.
----------
గనుల తవ్వకాలతో తీవ్ర ఇబ్బందులు
గ్రామస్తులు తమ సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. బొగ్గు గనుల తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్‌బావులు ఎండిపోతున్నాయని, అప్పుడప్పుడు భూమి కుంగిపోవడంతో ఇళ్ల గోడలకు బీటలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయోనని భయాందోళనకు గురవుతున్నామని తెలిపారు. సింగరేణి నల్లాల ద్వారా నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను తీసుకుని బొగ్గు గనుల తవ్వకాలు చేపట్టిన సింగరేణి సంస్థ గ్రామ సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
----------
సాంకేతిక పరిశీలన తర్వాత భద్రతా చర్యలు
అనంతరం మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ.. బోర్‌వెల్ కుంగిపోయిన సమాచారం అందిన వెంటనే రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు గ్రామాన్ని సందర్శించినట్లు తెలిపారు. బోర్‌వెల్ కుంగుబాటుకు గల కారణాలను సాంకేతిక నిపుణులతో పూర్తిస్థాయిలో పరిశీలించి, తదనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టాలని సింగరేణి అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. జనగామ గ్రామం జిడికె-1 ఇంక్లైన్ బొగ్గు గని పరిధిలో ఉండటంతో స్టోవింగ్ ప్రక్రియలో లోపం కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అయితే, పూర్తిస్థాయి సాంకేతిక పరిశీలన అనంతరమే కారణాలు నిర్ధారణ అవుతాయని తెలిపారు. గ్రామమంతటా జియాలాజికల్, ఎన్విరాన్‌మెంటల్ నిపుణులతో సమగ్ర సర్వే నిర్వహించాలని, భూమి కుంగుబాటు ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. గ్రామానికి అవసరమైన రహదారులు, డ్రైనేజీలు, వీధి దీపాలు, సోలార్ లైట్ల ఏర్పాటు, మరమ్మతులపై కూడా దృష్టి సారించాలని సూచించారు. జనగామ గ్రామ సంక్షేమం, అభివృద్ధి కోసం గతంలోనూ పోరాటాలు చేశామని, ఇకముందూ గ్రామస్తులకు అండగా ఉంటామని మేయర్ భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు శనివారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో జీఎం, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
----------
ప్రజలు ఆందోళన చెందొద్దు: జీఎం
సింగరేణి రామగుండం ఏరియా-1 జనరల్ మేనేజర్ డి.లలిత్ కుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, మేయర్ ఆదేశాల మేరకు స్థానిక కార్పొరేటర్, గ్రామస్తులు తెలిపిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. బోర్‌వెల్ కుంగుబాటు నేపథ్యంలో జనగామ గ్రామంపై గనుల ప్రభావాన్ని సింగరేణి జియాలాజికల్, సర్వే, ఎన్విరాన్‌మెంటల్ నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని పేర్కొన్నారు. కుంగిపోయిన బోర్‌వెల్‌తో పాటు గ్రామంలోని ఇతర బోర్‌బావులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, నల్లాల ద్వారా తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దాసరి సాంబమూర్తి, గట్ల రమేష్, సింగరేణి ఎస్‌ఓటు జీఎం చంద్రశేఖర్, ఏజెంట్ రమేష్‌బాబు, డీజీఎం (ఎక్స్‌ప్లోరేషన్) రమేష్‌బాబు, డీజీఎం వరప్రసాద్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, స్థానిక నాయకులు తోకల రమేష్, విజయ్, సింగరేణి శ్రీనివాస్, కృపాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.