నాకాఫ్ టెండర్‌ను రద్దు చేయాలి- ఐక్య విద్యార్థి సంఘాలు
సూర్య మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు,సంక్షేమ వసతి గృహాలకు నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్న నాకాఫ్ సంస్థకు కేటాయించిన టెండర్‌ను తక్షణమే రద్దు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర సాంఘిక సంక్షేమ వసతి గృహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. నాకాఫ్ సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న కేంద్రీకృత సరుకుల సరఫరా విధానం విద్యార్థుల సంక్షేమానికి విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. వసతి గృహాలకు నాణ్యతలేని సరుకులు,సరిపడా పరిమాణంలో కాకుండా అరకొరగా సరఫరా చేస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొన్ని సందర్భాల్లో సరైన ఆహారం అందక విద్యార్థులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు.గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.అయితే సరుకుల సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం,సమయానికి సరిపడా సరుకులు అందించకపోవడం వల్ల విద్యార్థుల ఆరోగ్యం,చదువుపై ప్రభావం పడుతోందని అన్నారు.విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని,నాకాఫ్ సంస్థకు కేటాయించిన టెండర్‌ను రద్దు చేసి నాణ్యమైన సరుకుల సరఫరాకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్,పూరేళ్ల నితీష్, రాంబాబు,మణిదీప్, శేఖర్‌తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.