కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి రాంసుందర్ రెడ్డి...
విజయనగరం, సూర్య : కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి నిరంతరం పర్యవేక్షించారు. జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్‌తో కలిసి ఆయన శనివారం రోజంతా కంట్రోల్ రూమ్‌లోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు ఫలితాలను వేగంగా తెప్పించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేశారు.
ఇందులో భాగంగా జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా సందర్శించి, అక్కడి రిటర్నింగ్ అధికారి (ఆర్వో) పి.బాలాజీతో మాట్లాడి ఏర్పాట్లు, లెక్కింపు తీరుతెన్నులపై ఆరా తీశారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని అత్యంత పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు.