మన్‌మర్రిలో ఖేత్ బచావో అభియాన్
యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.. మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర
షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 08)
షాబాద్ మండలంలోని మన్‌మర్రి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్‌పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర మాట్లాడుతూ... భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించాలని, సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఈ యాసంగిలో వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు సాగు చేయాలని కోరారు. పంట అవశేషాలను కాల్చకుండా నేల సారాన్ని కాపాడుకోవాలని, నీటిని పొదుపుగా వినియోగించి సాగు ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లాలాపేట బందయ్య, ఉపసర్పంచ్ బేగరి శంకరయ్య, ఏఈఓ మౌనిక, రైతులు పాల్గొన్నారు.