దళితులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.. డిప్యూటీ మేయర్ పదవిపై బంగి నాగేంద్ర ఆశలు!.. పార్టీ పెద్దలను వరుసగా కలుస్తూ విశ్వప్రయత్నం.. యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని బంగి నాగ విజ్ఞప్తి..
(అనంతపురం, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)
అనంతపురం నగర రాజకీయాల్లో డిప్యూటీ మేయర్ పదవి వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. నగర పాలక సంస్థలో దళిత సామాజిక వర్గానికి సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో 35వ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున కార్పొరేటర్‌గా విజయం సాధించిన బంగి నాగేంద్ర డిప్యూటీ మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
తనకు ఒక అవకాశం కల్పించాలని కోరుతూ బంగి నాగేంద్ర పార్టీకి చెందిన తాజా మాజీ సీనియర్ నాయకులను, జిల్లా స్థాయి నాయకులను విడివిడిగా కలుస్తూ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతూ, ప్రజల మధ్య ఉంటూ, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తన సేవలను పార్టీ నాయకత్వం గుర్తించాలని ఆయన కోరుతున్నట్లు తెలుస్తోంది.దళిత సామాజిక వర్గానికి గౌరవప్రదమైన అవకాశం కల్పించాలి..సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని దళిత సామాజిక వర్గానికి డిప్యూటీ మేయర్ పదవి కేటాయించే అంశాన్ని పార్టీ అధిష్ఠానం సానుకూలంగా పరిశీలించాలని స్థానికంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యువ నాయకులకు రాజకీయాల్లో తగిన అవకాశాలు కల్పిస్తే నగర అభివృద్ధికి మరింత తోడ్పాటు అందుతుందని పేర్కొంటున్నారు.యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని పట్టుదల!..బంగి నాగేంద్ర తనకు డిప్యూటీ మేయర్‌గా అవకాశం కల్పిస్తే నగర అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తాననే విశ్వాసంతో పార్టీ పెద్దలను సంప్రదిస్తున్నట్లు సమాచారం. తనలాంటి యువ నాయకులకు ఒక అవకాశం కల్పించాలని జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.మరి బంగి నాగేంద్ర చేస్తున్న ప్రయత్నాలకు పార్టీ పెద్దలు ఏ మేరకు స్పందిస్తారు? దళిత సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పించే దిశగా నిర్ణయం తీసుకుంటారా? యువ నాయకత్వానికి అవకాశం దక్కుతుందా? అనేది ఇప్పుడు అనంతపురం నగర రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
బంగి నాగేంద్ర ఆశలు ఫలిస్తాయా? డిప్యూటీ మేయర్ పీఠం ఆయనను వరిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే!