మద్యం మత్తులో బంధువును ఇటుకతో కొట్టి దారుణ హత్య
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:మద్యం మత్తులో కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన బంధువును సిమెంట్ ఇటుకతో తలపై బలంగా కొట్టి హత్య చేసిన ఘటన ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్‌లోని జగత్ స్వప్న గేటెడ్ కమ్యూనిటీలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా కందిపాడు గ్రామానికి చెందిన కుంటిగోర్ల శివ (27) అక్కడ నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న అతని బంధువు కాసబోయిన శ్రీనివాస్‌తో కొంతకాలంగా కుటుంబపరమైన గొడవలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్ శివతో గొడవపడి, సిమెంట్ ఇటుకతో అతని తలపై బలంగా కొట్టాడు. దీంతో శివ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఘట్‌కేసర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.