కొడకండ్ల లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలి
కొడకండ్ల, మేజర్ న్యూస్ సూర్య, కొడకండ్ల మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలనే డిమాండ్ రోజురోజుకూ బలపడుతోంది. విద్యార్థుల భవిష్యత్తును, మండల ప్రజల విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొడకండ్ల మండల కేంద్రంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని గ్రామస్తులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం గ్రామ ఉప సర్పంచ్ ఎండీ పెన్నా ఆధ్వర్యంలో స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సుమారు 150 మంది గ్రామస్తులు పార్టీలకతీతంగా హాజరై, మండల కేంద్రంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతపై చర్చించారు.విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా, మండల కేంద్రంలో పాఠశాల నిర్మాణం చేపట్టడం వల్ల చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తాయని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ప్రజలకు అందుబాటులో ఉండే మండల కేంద్రంలోనే పాఠశాల ఏర్పాటు చేయడం సమంజసమని స్పష్టం చేశారు.పార్టీలకు అతీతంగా ఒక్కటైన గ్రామస్తులు!ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో రాజకీయాలకు తావులేకుండా గ్రామ ప్రయోజనాలే లక్ష్యంగా అందరూ ఐక్యంగా ముందుకు రావాలని సమావేశంలో చర్చించారు. పాఠశాల నిర్మాణం మండల కేంద్రంలోనే చేపట్టేలా సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని కోరారు.అంతేకాకుండా తమ డిమాండ్ నెరవేరే వరకు ఐక్యంగా కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు.
మండల కేంద్రంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలి.. ఇది గ్రామస్తుల న్యాయమైన డిమాండ్. విద్యార్థుల భవిష్యత్తు కోసం సాగుతున్న ఈ పోరాటానికి ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందించి కోడకండ్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రిపోర్టర్: నవీన్, కొడకండ్ల, జనగామ జిల్లా