చట్టాలను తుంగలో తొక్కి.. రాత్రివేళల్లో అక్రమ బోర్ల తవ్వకాలు
కీసర,మేజర న్యూస్:ప్రభుత్వ నిషేధాజ్ఞలను బేఖాతరు చేస్తూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండల కేంద్రంలోని చంద్రగిరి కాలనీలో రాత్రివేళల్లో అక్రమంగా బోర్లు వేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతున్న నేపథ్యంలో బోర్ల తవ్వకాలపై ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మండల రెవెన్యూ కార్యాలయం, కీసర పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ వ్యవహారం జరుగుతుండటం అధికారుల పర్యవేక్షణ తీరును ప్రశ్నార్థకం చేస్తోంది.అధికారుల కార్యాలయాలు మూసివేసిన సమయాలను అదునుగా చేసుకుని, ముఖ్యంగా ఆదివారం వంటి సెలవు రోజుల్లో రాత్రిపూట బోర్లు వేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు, అనుమతుల ప్రక్రియను పక్కనపెట్టి యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారు. ఇంత బహిరంగంగా అక్రమ తవ్వకాలు సాగుతున్నా సంబంధిత రెవెన్యూ, భూగర్భ జల వనరుల శాఖ అధికారులు అడ్డుకోకపోవడం గమనార్హం.క్షేత్రస్థాయి సిబ్బందికి మామూళ్లు ముట్టజెప్పి అధికారుల కళ్లుగప్పి ఈ తవ్వకాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆంక్షలు అమలవుతున్నాయా? లేదా? అన్నది పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.మండల కేంద్రంలోనే, అదీ ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో అక్రమ బోర్ల తవ్వకాలు కొనసాగుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి టాస్క్‌ఫోర్స్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. అక్రమ బోర్ల తవ్వకాలను తక్షణమే నిలిపివేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారితో పాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కీసర మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.