పెనుగొల్లు విషాద ఘటనలో గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యం!
బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని జాతీయ రహదారిపై ఆందోళన
హోంమంత్రి అనిత భరోసా తో ఆందోళన విరమణ
ఎస్.రాయవరం, నవంబర్ 15, మేజర్ న్యూస్:
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు గ్రామంలోని వరాహ నదిలో చోటుచేసుకున్న విషాద ఘటన ఆదివారం విషాదాంతమైంది. శనివారం సాయంత్రం స్నానానికి వెళ్లి గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు ఆదివారం ఉదయం గాలింపు బృందాలు గుర్తించి వెలికితీశాయి. ఈ ఘటనతో పెనుగొల్లు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. యువకుల మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
అత్యంత దురదృష్టకర సంఘటన...
పెనుగొల్లు గ్రామానికి చెందిన ముప్పిడి వంశీ, కోడి గణేష్, కాతేటి రిషిత్ తో పాటు మరో నలుగురు యువకులు శనివారం సాయంత్రం పెనుగొల్లు గ్రోయిన్ సమీపంలోని వరాహ నదిలో స్నానానికి దిగారు. అయితే ఈత రాని ముగ్గురు యువకులు ఒక్కసారిగా నీటి ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది శనివారం సాయంత్రమే గాలింపు చర్యలు ప్రారంభించినప్పటికీ చీకటి పడటంతో వాటిని నిలిపివేశారు. ఆదివారం ఉదయం తిరిగి పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ సిబ్బంది స్థానిక మత్స్యకారుల సహకారంతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. కొన్ని గంటలపాటు సాగిన శోధన అనంతరం ముగ్గురు యువకుల మృతదేహాలను వరాహ నది నుంచి వెలికితీశారు.
న్యాయం చేయాలి అంటూ బాధిత కుటుంబాల నిరసన...
మృతదేహాల వెలికితీతలో ఆలస్యం జరిగిందని ఆరోపిస్తూ గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై గంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న నర్సీపట్నం డీఎస్పీ ఆధ్వర్యంలో నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్ల నుంచి అదనపు పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికారులు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహాయంపై హామీ ఇచ్చారు.
హోంమంత్రి అనిత నుంచి ఆర్థిక సాయం...
ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. వీడియో సందేశం ద్వారా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వ్యక్తిగతంగా దళిత బిడ్డగా తాను ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే ప్రభుత్వం నుంచి మరింత సహాయం అందేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆమె హామీతో బాధిత కుటుంబ సభ్యులు తమ ఆందోళనను విరమించారు.
ఆందోళన ముగిసిన అనంతరం పోలీసులు మృతదేహాలను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, యువకుల అంత్యక్రియల్లో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.