telangana
మచ్చ బొల్లారం ట్రాన్స్‌ఫర్ స్టేషన్ తరలింపునకు కసరత్తు.. నాలుగు ప్రత్యామ్నాయ స్థలాల పరిశీలన
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ : మచ్చ బొల్లారంలోని హిందూ శ్మశానవాటిక ప్రాంతంలో కొనసాగుతున్న వ్యర్థాల నిర్వహణపై స్థానికంగా వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను మరోచోటికి తరలించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి గుర్తించిన నాలుగు ప్రత్యామ్నాయ స్థలాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి సయాని శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ట్రాన్స్‌ఫర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదించిన నాలుగు ప్రాంతాలను సందర్శించిన ఆమె ఆయా స్థలాల భౌగోళిక పరిస్థితులు, అనుకూలతలు, వ్యర్థాల నిర్వహణకు ఉన్న అవకాశాలపై ఆరా తీశారు. ప్రస్తుత ట్రాన్స్‌ఫర్ స్టేషన్ పరిస్థితి, తరలింపు అవసరం, ప్రత్యామ్నాయ స్థలాలకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆమెకు వివరించారు.హిందూ శ్మశానవాటిక ప్రాంతంలో వ్యర్థాల నిర్వహణ, ప్రస్తుత స్థలం వినియోగంపై స్థానికులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని ట్రాన్స్‌ఫర్ స్టేషన్ తరలింపు ప్రతిపాదనపై సమీక్షించారు. ప్రజల మనోభావాలకు గౌరవం ఇస్తూనే ప్రజారోగ్యం, పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అనువైన స్థలాన్ని ఎంపిక చేయాల్సిన అవసరాన్ని పరిశీలించారు.