కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ భూములను అమ్మొద్దు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్ పల్లి, మేజర్ న్యూస్:శుక్రవారం కేపీహెచ్‌బీ భూముల అమ్మకాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో సుమారు రూ.2,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి మహిళా పార్కులు, చిల్డ్రన్ పార్కులు, ఇండోర్ స్టేడియాలు, క్రీడా మైదానాలు వంటి అనేక ప్రజా అవసరాల సదుపాయాలను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. అలాంటి ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ భూములను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం దురదృష్టకరమని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ.2,000 కోట్ల విలువైన భూములను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు.
హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాబోయే తరాలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ భూములను అమ్మేస్తే భవిష్యత్ తరాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
మియాపూర్ భూముల విషయంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకుందని గుర్తుచేశారు. కేపీహెచ్‌బీ వంటి పెద్ద కాలనీలో ఫైర్ స్టేషన్ లేకపోవడం, ప్రజలకు అవసరమైన పెట్రోల్ బంకు కోసం కేటాయించాల్సిన స్థలాన్ని కూడా అమ్మకానికి పెట్టేందుకు టెండర్లు పిలవడం ఏమిటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ హౌసింగ్ బోర్డు భూముల అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్, తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, హైదరాబాద్ నగర అవసరాలపై సరైన అవగాహన లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. అలీబాబా అరడజను దొంగల మాదిరిగా ప్రభుత్వ భూముల అమ్మకాలే లక్ష్యంగా కొందరు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ప్రజల తరఫున ప్రభుత్వ భూముల అమ్మకాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, విలేకరులపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. హౌసింగ్ బోర్డు భూములను అమ్మకుండా కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం హౌసింగ్ బోర్డు భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామని, టెండర్లలో ఎవరైనా పాల్గొంటే వాటిని కూడా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్రాణాలు పోయినా సరే ప్రజల తరఫున పోరాడి ప్రభుత్వ భూములను కాపాడుకుంటామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు.