కొల్చారంలో ఆల్ ఇండియా బంజారా మేళా
కొల్చారం;మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని వసురాం తండా ఆతిథ్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో కొల్చారంలో ఆల్ ఇండియా బంజారా మేళా నిర్వహించనున్నట్లు బంజారా నాయకులు, వసురాం తండా సర్పంచ్ వినోద్ నాయక్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మేళా వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వినోద్ నాయక్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో సుమారు నాలుగు లక్షల మంది బంజారా ప్రజల భాగస్వామ్యంతో బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక పరిచయ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళాకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా బంజారా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని పేర్కొన్నారు.బంజారా సంస్కృతి, ఐక్యత, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ మేళాను విజయవంతం చేసేందుకు బంజారా ప్రజలు, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సీతారాం తండాకు చెందిన మోహన్ సింగ్, మాజీ ఎంపీటీసీ రామ్ చందర్, అచ్చన్నపల్లి తండా ఎస్టీ సెల్ అధ్యక్షుడు జగన్ నాయక్, సంగాయిపేట మాజీ ఎంపీటీసీ డి. రాజు, మెదక్ గోర్ సేన అధ్యక్షుడు ఎం. మిట్టు నాయక్ తదితరులు పాల్గొన్నారు.