వదలని మురసు.. చెరువులను తలపిస్తున్న రహదారులు.
రాజానగరం, మేజర్ న్యూస్: మురసు తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని పలు గ్రామాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులు నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇప్పటికే వరి పంట కోతకు సిద్ధమవుతున్న సమయంలో కురుస్తున్న వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పొలాల్లో నీరు నిలిచిపోవడంతో పంటలు నీట మునిగే పరిస్థితి నెలకొంది. గతంలో కురిసిన వర్షాలు, తుఫాన్ల ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రస్తుత వర్షాలు మరింత ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మండలంలోని పలు చెరువులు, నీటి వనరులు భారీ వర్షాలతో నిండుకుండలను తలపిస్తున్నాయి. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే కొన్ని చెరువులకు గండ్లు పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.భారీ వర్షాల కారణంగా రహదారులపై గుంతలు ఏర్పడటంతో పాటు ఇప్పటికే దెబ్బతిన్న రోడ్లు మరింత అధ్వానంగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసర పనులపై బయటకు వెళ్లే ప్రజలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.