స్థానిక ఎన్నికలకు అంతా రెడీ
అరకులోయ, నవంబర్ 4, మేజర్ న్యూస్:
అరకులోయ మండల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టారు.2026వ సంవత్సరం నాటికి ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం మండల వ్యాప్తంగా 42 వేల 725 మంది ఓటర్లు ఉన్నారు.వీరిలో 20,599 మంది మహిళ ఓటర్లు,22, 175 మంది పురుష ఓటర్లు ఉన్నారు.మండలంలోని 14 పంచాయతీలకు చెందిన 16 ఎంపీటీసీలు,ఒక జెడ్పిటిసి స్థానాలకు సంబంధించి పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో 47 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక,అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా కేంద్రాలపై గట్టి నిఘా పెట్టారు.ఎన్నికల సంఘం నియమ నిబంధన ప్రకారం ఈనెల 5వ తేదీన పోలింగ్ జరుగుతున్న కారణంగా అవసరమైన సామాగ్రిని పంపిణీ చేశారు.గురువారం ఉదయం ఏడు గంటల నుంచి బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం ముందస్తు భద్రత చర్యలు చేపట్టింది. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మండల వ్యాప్తంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.ఎన్నికల సమయంలో ప్రజాశాంతికి భంగం కలిగించినా, అసభ్యకరంగా వ్యవహరించినా,ఓటర్లను బెదిరించినా,ప్రలోభాలకు గురిచేసినా,ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక సీఐ కోటేశ్వరరావు, ఎస్సై మల్లేశ్వర రావు హెచ్చరించారు. మండలంలో ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకున్నట్టు ఎన్నికల అధికారులు మాదేంశెట్టి. శ్రీధర్,వీసం.ప్రసాద్ గుంటూరు.రాజా శ్రీధర్ తెలిపారు.