కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి... - కాంగ్రెస్ వైఫల్యాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలి - మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
సూర్య - పెద్దపల్లి రూరల్ : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అరెస్టులు, నిర్బంధాలు ఎదురైనా కేసీఆర్ చేపట్టిన దీక్షను విరమించకుండా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపారని గుర్తుచేశారు. నవంబర్ 29 దీక్షా దివస్ తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.కేసీఆర్ పాలనలో సాగునీరు, తాగునీరు, విద్యుత్, గురుకుల పాఠశాలలు, రైతుబంధు వంటి పథకాలతో తెలంగాణ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. అప్పటి పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన పెన్షన్ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాజకీయాలు చేస్తూ సాగునీటి సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కన్నెపల్లి వద్ద మోటార్లను వెంటనే ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులను పంటలు వేయవద్దని చెప్పడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులకు తెలంగాణ ఉద్యమ చరిత్రపై అవగాహన లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పోలీసులకు భయపడకుండా ప్రజా సమస్యలపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, బీఆర్‌ఎస్ సమావేశాలకు ప్రజలే స్వచ్ఛందంగా తరలివస్తున్నారని అన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలను చైతన్యపరిచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఈ నెల 29 న జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలి రావాలని అన్నారు.
అనంతరం మేడిగడ్డ నుండి కొండపోచమ్మ సాగర్ వరకు 400 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసిన ఉప్పు రాజ్ కుమార్, కాశీపాక వాసు, ఆరేపల్లి సరేష్ లను శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మాజీ జడ్పీటీసీ గంట రాములు పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, మండల అధ్యక్షులు లక్ష్మణ్, మాజీ పాక్స్ చైర్మన్ లు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.