సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి నవంబర్ 21న వెయ్యి మందితో మెగా శిక్షణ కార్యక్రమం
సూర్య - పెద్దపల్లి : గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సీపీఆర్‌పై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. నవంబర్ 21న ఉదయం 10 గంటలకు సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల మైదానంలో మెగా సీపీఆర్ అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, వైద్య కళాశాలలకు చెందిన వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రాణరక్షణ నైపుణ్యాలపై అవగాహన పెంపొందించుకోవడం అవసరమన్నారు. అత్యవసర సమయంలో సీపీఆర్ అందించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు.
విద్యార్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని, నేర్చుకున్న నైపుణ్యాలను ఇతరులకు కూడా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి మెడికల్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు కలెక్టర్‌ను కలిసి ఆహ్వానించారు.