పక్కాగా జనగణన గణాంకాల నమోదు చేపట్టాలి
డి ఆర్ ఓ మోహన్ కుమార్
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: జనగణనకు సంబంధించిన గణాంకాల నమోదు ప్రక్రియలో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి ఆర్ ఓ మోహన్ కుమార్ సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జనగణన పై చివరి రోజు శిక్షణ కార్యక్రమానికి డి ఆర్ ఓ కె మోహన్ కుమార్ పాల్గొని మాస్టర్ ట్రైనర్లకు పలు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డి ఆర్ ఓ మాట్లాడుతూ ఎన్యుమరేటర్లకు శిక్షణ పూర్తయిన వెంటనే వారిని క్షేత్రస్థాయిలో విధులకు కేటాయించి, ఐదు నుంచి ఆరు గ్రామాలకు ఒకసారి ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల పనితీరును పర్యవేక్షిస్తూ వారానికొకసారి సమీక్ష నిర్వహించాలని తెలిపారు.ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు తమకు అందించిన హ్యాండ్‌బుక్‌లోని మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలని, విధుల నిర్వహణలో ఏవైనా సందేహాలు తలెత్తితే మాస్టర్ ట్రైనర్లు మునిచంద్ర, లక్ష్మీకళ తో పాటు జిల్లా కోఆర్డినేటర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. గతంలో చేపట్టిన హౌస్ లిస్టింగ్, సర్వేయింగ్ ప్రక్రియలో కొన్ని ప్రాంతాల్లో మ్యాపింగ్ సక్రమంగా జరగకపోవడం, కొన్ని నివాస ప్రాంతాలు మ్యాపింగ్ పరిధిలోకి రాకపోవడం, మరికొన్ని ప్రాంతాలు పరిధికి వెలుపల నమోదవడం వంటి సమస్యలు గుర్తించామని తెలిపారు. గతంలో చేసిన నమోదుల్లో ఇప్పటికీ కొన్ని సవరణలు చేయాల్సి వస్తోందని, ఈ కారణంగా ప్రక్రియ పూర్తి కావడానికి రెండు మూడు నెలలకు పైగా సమయం పడుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రక్రియలో ఎలాంటి తప్పులు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.డైరెక్టర్ నిర్వహించిన సమావేశంలో సూచించిన సవరణలు, మార్గదర్శకాలను పది రోజుల్లోగా అమలు చేయాలని తెలిపారు. ఈ నెల 20, 22 తేదీల్లో సంబంధిత అధికారుల సమక్షంలో మరోసారి రా డేటాను పరిశీలించి, గణాంకాల్లో ఉన్న వ్యత్యాసాలను గుర్తించి సరిచేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించే సమయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, సరైన సమాచారాన్ని మాత్రమే నమోదు చేయాలని స్పష్టం చేశారు.జనగణనకు సంబంధించిన ప్రతి దశలోనూ అధికారులు, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు సమన్వయంతో పనిచేస్తూ, కచ్చితమైన సమాచారాన్ని సేకరించి నమోదు చేయాలని, తద్వారా భవిష్యత్తులో ఎలాంటి సవరణలకు అవకాశం లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.
ఉమా శంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.