హెచ్‌ఐవీ నియంత్రణలో తెలంగాణకు జాతీయ స్థాయిలో రెండో స్థానం సురక్షిత్ హోదా సాధించిన 20 జిల్లాల్లో పెద్దపల్లి
సూర్య - పెద్దపల్లి : హెచ్‌ఐవీ నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని సాధించడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో) వెల్లడించిన తాజా స్కోర్‌కార్డులో రాష్ట్రం ఈ ఘనత సాధించిందని పేర్కొన్నారు.
2023 డిసెంబర్‌లో జాతీయ స్థాయిలో 32వ స్థానంలో ఉన్న తెలంగాణ, గత ఏడాది 13వ స్థానానికి చేరుకుని ప్రస్తుతం రెండో స్థానాన్ని కైవసం చేసుకుందన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 20 జిల్లాలు హెచ్‌ఐవీ నియంత్రణకు సంబంధించిన 95-95-95 లక్ష్యాలను సాధించి సురక్షిత్ హోదా పొందాయని తెలిపారు. ఇందులో పెద్దపల్లి జిల్లా ఉండటం సంతోషకరమన్నారు. హెచ్‌ఐవీ బాధితులను గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం, ప్రజల్లో అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ సమిష్టి కృషితో ఈ విజయం సాధ్యమైందని కలెక్టర్ అభినందించారు. సురక్షిత్ హోదా పొందిన జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పవిత్ర, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.