దివ్యాంగ క్రీడాకారులకు ప్రతిభ చాటుకునే అవకాశం...
సూర్య - పెద్దపల్లి : దివ్యాంగ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేందుకు SATG పారా స్పోర్ట్స్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ 2026-27 నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎ. సురేష్ తెలిపారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ, ఆదిత్య మెహతా ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
12 ఏళ్లు పైబడిన దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు. డిసెంబర్ 3 నుంచి 9 వరకు ఆన్‌లైన్ స్క్రీనింగ్, అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎంపికైన వారికి 2027 జనవరిలో హైదరాబాద్‌లో జాతీయ ప్రతిభ గుర్తింపు శిబిరం నిర్వహిస్తారని పేర్కొన్నారు.
అభ్యర్థులు యూడీఐడీ కార్డు, దివ్యాంగ ధ్రువీకరణ పత్రం, వయస్సు ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలని సూచించారు. 18 ఏళ్లలోపు వారు తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి పాల్గొనాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9963960063 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.