బంగి నాగేంద్ర కు అనంత డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలి
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : అనంత నగరపాలక సంస్థ ఎన్నికల్లో 35వ డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొందిన.. దళిత వర్గానికి చెందిన బంగి నాగేంద్రకు డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలని జిల్లా దళిత సంఘాల నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నగరంలో జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా దళిత సంఘాల నాయకులు బీసీ ఆర్ దాస్, కేపీ నారాయణస్వామి, నేరమెట్ల ఎల్లన్న, చిన్న ఆంజనేయులు, సుగమంచి శ్రీనివాసులు, గట్టు రామాంజనేయులు, ఏసు పాదం, హరి ప్రసాద్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో మాదిగ కులానికి చెందిన బంగి నాగేంద్ర.. గత 20 సంవత్సరాలకు పైగా టిడిపి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారన్నారు. పార్టీ చేపట్టిన అనేక పోరాటాలలో నాగేంద్ర పై కేసులు కూడా పెట్టిన కూడా.. పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంత నగరపాలక సంస్థ ఏర్పడినప్పటి నుండి ఎస్సీ సామాజిక వర్గానికి.. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులలో రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించలేదని.... మిగిలిన కులాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. జిల్లాల్లో అత్యధికంగా ఎస్సీలు, ముఖ్యంగా మాదిగ జనాభా ఉన్నప్పటికీ.. రాజకీయ గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సామాజిక గౌరవం కల్పించామని చెబుతుందని, మరి అనంతపురం నగరపాలక సంస్థలో ఇంతవరకు.. దళితులకు సరైన ప్రాధాన్యత కల్పించలేదని, ప్రస్తుత పాలకవర్గంలోనైనా మాదిగ సామాజిక వర్గానికి చెందిన.. బంగి నాగేంద్రకు డిప్యూటీ మేయర్ పదవి కేటాయించి న్యాయం చేయాలని కోరారు.