అండుకొర్ర విత్తన నమూనాల సేకరణ నార్లపురంలో పొలంబడి పంటను పరిశీలించిన ఆర్గానిక్ ఇన్‌స్పెక్టర్
వెల్దుర్తి, మేజర్ న్యూస్: వెల్దుర్తి మండలం నార్లపురంలో ఇండిగ్యాప్ (మేలైన వ్యవసాయ పద్ధతులు) పొలంబడి ద్వారా సాగు చేసిన అండుకొర్ర పంటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రీయ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ (గుంటూరు) ఆర్గానిక్ ఇన్‌స్పెక్టర్ షేక్ సుహేల్ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో రైతులతో ముఖాముఖి నిర్వహించి సాగు విధానాలను అడిగి తెలుసుకున్నారు. అతి తక్కువ ఎరువులు, పురుగుమందులు వినియోగిస్తూ పర్యావరణానికి హాని కలగకుండా రైతులు పంటను సాగు చేసినట్లు నిర్ధారించారు. అనంతరం పొలాల్లో పండిన అండుకొర్ర విత్తన నమూనాలను సేకరించి, పురుగుమందుల అవశేషాల నిర్ధారణ నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత అర్హులైన రైతులకు ‘స్కోప్ సర్టిఫికెట్’ జారీ చేస్తామని సుహేల్ తెలిపారు. ఈ ధ్రువీకరణ పత్రం ద్వారా నాణ్యమైన విత్తనంగా విలువ ఆధారిత (వాల్యూ అడిషన్) మార్పులు చేసుకుని, మార్కెట్ ధర కంటే అధిక రేటుకు విక్రయించుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషా, వ్యవసాయ విస్తరణ అధికారులు అజయ్ భార్గవ్, సంధ్యారాణి, రైతులు పాల్గొన్నారు.