స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఫాక్స్‌కాన్ ద్వారా ఇప్పటికే 300 మందికి ఉపాధి
సూర్య - పెద్దపల్లి : జిల్లాలోని స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించి, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులతో యువతకు ఉపాధి కల్పనపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టాస్క్ సెంటర్ ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. ఫాక్స్‌కాన్ సంస్థ ఇప్పటికే పెద్దపల్లి జిల్లాకు చెందిన 300 మంది యువతకు ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు. ఇతర కంపెనీలు కూడా స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని సూచించారు.
మహిళలకు ప్రత్యేకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. మహిళలు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రోత్సహించాలని తెలిపారు. కంపెనీలు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని ఉపాధి అవకాశాలు పెంపొందించాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి రాజశేఖర్, టాస్క్ రీజినల్ సెంటర్ ఇన్‌చార్జి కౌసల్య, ఫాక్స్‌కాన్ ప్రతినిధి కౌశిక్‌తో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.