ఆరుతడి పంటల సాగుపై అన్నదాతలు మొగ్గు చూపాలి : పశుగ్రాసం,పచ్చిరొట్ట ఎరువుల పంటలు సాగు చేయాలి : వ్యవసాయ అధికారులచే రైతులకు అవగాహన
మదనపల్లె రూరల్,మేజర్ న్యూస్ : ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో రబీ పంటల సాగువిస్తీర్ణం తగ్గిపోకుండా,అందుబాటు లో ఉన్న నీటివనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జారీ చేసిన ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రైమరీ సెక్టార్ సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి నిమ్మనపల్లె మండలంలో పర్యటించి రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా నిమ్మనపల్లె,రెడ్డివారిపల్లె,తవళం,రాచవేటివారిపల్లె రైతు సేవా కేంద్రాల పరిధిలోని రైతులతో సమావేశమై ఎల్‌నినో ప్రభావం,నీటి లభ్యత,పంటల సాగు పరిస్థితులపై వివరించారు.ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అధిక నీటి అవసరమయ్యే వరి పంట సాగును తగ్గించి,ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు,ఇతర ఆరుతడి మరియు వాణిజ్య పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.నీటి లభ్యతను బట్టి తగిన పంటలను ఎంపిక చేసుకోవాలని,పంటల సాగులో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని రైతులకు వివరించారు.అదేవిధంగా జిల్లాలో గత ఐదు నుంచి ఆరు సంవత్సరాలుగా బీడుగా ఉన్న భూములను సాగులోకి తీసుకురావడంతోపాటు,ప్రస్తుతం సాగుకు వీలుకాని భూముల్లోనూ కనీసం పశుగ్రాసం లేదా పచ్చిరొట్ట ఎరువుల పంటలను సాగు చేయాలని సూచించారు.తద్వారా ఏడాది పొడవునా భూములపై పచ్చదనం ఉండేలా చర్యలు చేపట్టాలని రైతులకు అవగాహన కల్పించారు.జిల్లాలో ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ,రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై నిరంతరం అవగాహన కల్పించాలని,పంటల సాగు విస్తీర్ణం తగ్గకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి