నిన్న వైసీపీ కండువా.. నేడు అమిలినేని సమక్షంలో టిడిపి కండువా వేసుకున్న నాయకులు.
కళ్యాణదుర్గం : రాజకీయాల్లో నాయకుల పార్టీ మార్పులు, తిరిగి సొంత పార్టీలోకి చేరికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురుబ ఉమేష్ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఆయన, మరుసటి రోజే మనసు మార్చుకుని తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకుని సొంత గూటికి చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే.. బోరంపల్లి గ్రామానికి చెందిన కురుబ ఉమేష్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆయనకు మాయమాటలు చెప్పి పార్టీ మారేలా ప్రేరేపించడంతో నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నట్లు సమాచారం. అయితే ఆ నిర్ణయంపై పునరాలోచన చేసిన ఉమేష్, వైసీపీలో కొనసాగడం తనకు ఇష్టం లేదని భావించి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కురుబ సంఘం నాయకులు చొరవ తీసుకుని ఉమేష్‌ను తిరిగి టీడీపీలోకి తీసుకువచ్చేందుకు కృషి చేశారు. వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును కలిసిన ఉమేష్, ఆయన చేతుల మీదుగా పసుపు కండువా కప్పుకుని తెలుగుదేశం పార్టీలోకి తిరిగి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఒక్కరోజు వ్యవధిలోనే పార్టీ మార్పు నుంచి తిరిగి సొంత పార్టీలోకి చేరడం బోరంపల్లి గ్రామ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. కురుబ సంఘం నాయకుల సమన్వయం, చొరవతో ఉమేష్ తిరిగి టీడీపీలోకి రావడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.