పాఠశాలల్లో వంద శాతం హాజరే లక్ష్యంగా కృషి చేయాలి : ఎంఈఓ నిజాముద్దీన్
కృష్ణ సూర్య న్యూస్ :
పాఠశాలలో వంద శాతం హాజరు నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బృందం తీసుకోవాలని ఎంఈఓ నిజాముద్దీన్ స్పష్టం చేశారు.
మండలంలోని ముడుమాల్ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) నిజాముద్దీన్ బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించడంతో పాటు, విద్యార్థుల అభ్యసన స్థాయిలు మరియు ఉపాధ్యాయుల బోధనా విధానాలపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధానోపాధ్యాయులు దండు శేఖర్‌తో కలిసి నాలుగో తరగతిలో ఉపాధ్యాయురాలు ఆస్మా నిషాత్ నిర్వహిస్తున్న ఆంగ్ల బోధనను ఎంఈఓ పరిశీలించి, పలు సూచనలు చేశారు.అభ్యసన సమస్యలను అంచనా వేసేందుకు వీలుగా 'ప్రశస్తి' స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఐఈఆర్‌పీ సురేష్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు డెమో నిర్వహించి, తరగతి వారీగా ఈ ప్రక్రియను బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.అదేవిధంగా తరచుగా గైర్హాజరవుతున్న విద్యార్థుల ఇళ్లను సందర్శించి, తల్లిదండ్రులతో మాట్లాడి బడికి రప్పించాలని సూచించారు.పాఠశాలలో బోధనాభ్యసన సామగ్రిని (టీఎల్ఎం) విరివిగా ఉపయోగించాలని, విద్యార్థుల సామర్థ్యాలకు తగినట్లుగా బోధన సాగాలని కోరారు. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని (ఎండిఎం) మెనూ ప్రకారం నాణ్యంగా అందించాలని కార్మికులను ఆదేశించారు.నెల చివరిలో నిర్వహించనున్న మిడ్‌లైన్ పరీక్షలకు విద్యార్థులను సమర్థవంతంగా సిద్ధం చేయాలని ఎంఈఓ ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దండు శేఖర్, ఉపాధ్యాయులు ఆస్మా నిషాత్, పద్మావతమ్మ, ఖలీముద్దీన్, మాహేశ్వరి, రేణుక తదితరులు పాల్గొన్నారు.
నర్సిములు, సూర్య రిపోర్టర్ కృష్ణ మండలం