డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా పోటీలు..లోగో, మస్కట్ గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్..
సూర్య.. రాజన్న సిరిసిల్ల
రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 8వ ఎడిషన్ ఖేలో ఇండియా నేషనల్ యూత్ గేమ్స్ - 2026 లోగో, మస్కట్ గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్ ఫోటో దిగారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్ తో పాటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్ పట్టణాలలో జాతీయ యువజన క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో నిర్వహిస్తున్న జాతీయ క్రీడలపై జిల్లాలోని యువత, క్రీడాకారులకు అవగాహన కల్పించడానికి, విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
క్రీడలకు సంబంధించిన లోగో, మస్కట్ లను జిల్లాలోని క్రీడా ప్రాంగణాలు, బస్ స్టాండ్ లు, ప్రధాన కూడళ్లలో కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్ల ద్వారా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో ఏవో రామ్ రెడ్డి, డీటీసీపీఓ అన్సార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సీపీఓ సంపత్ కుమార్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఏ. రాందాస్ తదితరులు పాల్గొన్నారు.