ఎం వెంకటం పల్లి లో వైసీపీకి షాక్... టిడిపిలో చేరిన ఏడు కుటుంబాలు.
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మండల పరిధిలోని ఎం. వెంకటాంపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలకు చెందిన ఏడు కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. అనంతపురం నగరంలోని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుడు ఏరాసు ప్రతాప్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు సమక్షంలో నూతనంగా పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోయ సోమశేఖర్, బోయ గణేష్, బోయ లింగప్ప, బోయ పాపన్న, షేక్ బాషా కుటుంబాలకు చెందిన వారు టీడీపీలో చేరి తమ రాజకీయ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పార్టీలకతీతంగా ప్రజలకు అందిస్తున్న సేవలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. తమకు రాజకీయాలకన్నా ప్రాంత అభివృద్ధే ముఖ్యమని, గ్రామం అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందాలన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ విధానాలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి, నాయకత్వం సూచనల మేరకు పనిచేస్తూ గ్రామస్థాయిలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, పూల నాగరాజు నూతనంగా పార్టీలో చేరిన కుటుంబాలకు అభినందనలు తెలియజేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తామని, పార్టీ అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేస్తామని తెలిపారు. గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎం. వెంకటాంపల్లి గ్రామంలో ఒకేసారి ఏడు కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికతో గ్రామంలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరుతుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కురుబ సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.