ఎంపీపీ జడ్పీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: జిల్లాలో మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ), జిల్లా ప్రజా పరిషత్ (జడ్పీ) అధ్యక్ష, ఉపాధ్యక్షుల పరోక్ష ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత తేదీల్లో ఎన్నికల ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు.నవంబర్ 19న ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు, నవంబర్ 20న జడ్పీ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సభ్యులకు సమావేశ నోటీసులు జారీ చేశామన్నారు. ఎంపీపీ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 19న ఉదయం 10 గంటలలోపు నామినేషన్ల స్వీకరణ, మధ్యాహ్నం 12 గంటలలోపు పరిశీలన, మధ్యాహ్నం 1 గంటలోపు ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు సభ్యుల ప్రమాణ స్వీకారం, కో-ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
20న జడ్పీ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు
అదేవిధంగా నవంబర్ 20న జడ్పీ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలలోపు నామినేషన్ల స్వీకరణ, మధ్యాహ్నం 12 గంటలలోపు పరిశీలన, మధ్యాహ్నం 1 గంటలోపు ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని, మధ్యాహ్నం 1 గంటకు ఇద్దరు కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. ఎన్నిక పూర్తికాని పక్షంలో నవంబర్ 21న మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో కోరం నిబంధనలు, రాజకీయ పార్టీల విప్ నిబంధనలు తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. సభ్యులు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రత కల్పించామని, ఎన్నికలు జరిగే ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు, వీడియో గ్రఫీ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన అధికారులు తమ బాధ్యతలను సమన్వయంతో నిర్వర్తించాలని, అవసరమైన సిబ్బంది, సామగ్రి, భద్రతా ఏర్పాట్లను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా విజయవంతం చేయదానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.