కలకలం రేపుతున్న పెద్దపులి సంచారం
నూజివీడు, మేజర్ న్యూస్: పెద్దపులి సంచారం ప్రజల్లో కలకలం రేపుతోంది.గత కొన్ని నెలలుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి తాజాగా ముసునూరు మండలం రమణక్కపేట పరిసర ప్రాంతాలకు చేరుకుంది.లింగపాలెం,ధర్మాజీగూడెం,చింతలపూడి, చాట్రాయి,చిత్తపూరు మీదుగా రమణక్కపేట ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు.బుధవారం తెల్లవారుజామున రమణక్కపేటలోని తేలకలమ్మ గట్టుపై పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు.రమణక్కపేట, చాట్రాయి మండలం చిత్తపూరు,విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామాలకు సమీపంలో పులి సంచరిస్తుండటంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.పులి కదలికలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.పులిని సురక్షితంగా బంధించేందుకు ప్రత్యేక ఫారెస్ట్ అధికారులు,స్పెషల్ రెస్క్యూ టీమ్ చర్యలు చేపట్టారు.అటవీ,పోలీస్,రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.పులి సంచార ప్రాంతాలకు సమీపంలోని రైతులు,వ్యవసాయ కూలీలు,పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని,పశువులను అడవుల సమీపంలో మేతకు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.పులిని చూడటానికి గుంపులుగా వెళ్లడం,కేకలు వేయడం,రాళ్లు విసరడం వంటి చర్యలకు పాల్పడవద్దని,పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.పెద్దపులిని సురక్షితంగా పట్టుకునే వరకు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.