BREAKING
జాతీయ స్థాయి మల్లకంభ పోటీలకు విజ్ఞాన విహార విద్యార్థులు ప్రజలు తమ ఓటుతో మంచికి పట్టం కట్టాలి -- ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపు ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తుఫాన్‌ హెచ్చరికలతో అధికారుల అప్రమత్తం మహిళ కన్నీటికి చలించిన ఎమ్మెల్యే చింతమనేని -- అట్లతద్ది వాయినాల సరుకుల కోసం తెచ్చుకున్న రూ. 20 వేలు పోగొట్టుకున్న ఆమెకు కొండంత అండ 92వ వార్డు సమగ్రాభివృద్ధే ధ్యేయం: స్వతంత్ర అభ్యర్థి లీలాదేవి కొనుగోలుదారులతో కిటకిటలాడిన పూర్ణ మార్కెట్ 5వ వార్డులో వైసీపీ విస్తృత ప్రచారం..:విత్తనాల మూర్తికి మద్దతుగా పినిపే శ్రీకాంత్, ప్రచారం.. టిడిపి అభ్యర్థి ఏడువాక శ్రీమహాలక్ష్మి విజయం ఖాయం డ్రైనేజీలను పరిశుభ్రం చేస్తున్న సిబ్బంది 15వ వార్డులో వైసీపీ అభ్యర్థిని సంసాని శ్యామలాదేవి ప్రచార జోరు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు కోసం నేటి నుంచే ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర 62వార్డులో ఎన్నికల ప్రచారం హోరు సర్వోదయ శిక్షణతో ప్రజాసేవకు కొత్త స్ఫూర్తి రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం :మంత్రి సుభాష్

కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు -- మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ -- నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

Select Suryaa Now
కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు -- మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ -- నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

*నారాయణపేట, సూర్యన్యూస్* : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, వివిధ పథకాల ద్వారా అభివృద్ధి పనులు చేపడుతోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజలకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం మురహరిదొడ్డి గ్రామంలో రూ.10 లక్షల వీబీ జీ రామ్ జీ నిధులతో నిర్మించిన మహిళా సంఘం నూతన భవనాన్ని ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. అనంతరం ఉట్కూరు మండల కేంద్రంలో రూ.10 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించిన కామన్ వర్క్ షెడ్‌ను ప్రారంభించారు. ఉట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పెద్దజేట్రం గ్రామంలో అంగన్‌వాడీ భవనం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘాల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద మక్తల్ నియోజకవర్గానికి అత్యధికంగా రోడ్లు మంజూరు చేయించామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో పెద్ద ఎత్తున జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మక్తల్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి మంత్రులు పలుమార్లు శంకుస్థాపనలు చేసినప్పటికీ పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు అందుతున్న పనులే కొనసాగుతున్నాయని అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక పోవడంతో వారు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

*కాంగ్రెస్ హామీలపై విమర్శలు*
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని డీకే అరుణ విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బీజేపీకి చెందిన నిరుపేద కార్యకర్తలకు అన్యాయం జరిగితే ప్రభుత్వంతో పోరాడి ఇళ్లు మంజూరు చేయిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కూడా ఇళ్ల నిర్మాణానికి నిధులు అందుతాయని పేర్కొన్నారు. ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించిన ఆమె, కాంగ్రెస్ కుట్రలను ప్రజలు నమ్మవద్దని కోరారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, బీజేపీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఐక్యంగా ఉండి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భీమా, సంగంబండ రిజర్వాయర్ల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు చిట్టెం నర్సిరెడ్డి కృషి చేశారని గుర్తుచేశారు. కృష్ణా మండలంలో ప్రత్యేకంగా కనిపించే నిలువురాళ్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.

*వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు*
వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ప్రజలకు ఎంపీ డీకే అరుణ శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలోని విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయనకు గౌరవం కల్పించిందని అన్నారు.

*అంబాత్రయ క్షేత్రంలో పూజలు*
నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలో శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి మఠం, శ్రీ అంబాత్రయం ఆలయంలో ఎంపీ డీకే అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ ఆదిత్య పరశ్రీ ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పగడాకుల శ్రీనివాస్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సత్య యాదవ్, లక్ష్మీకాంత్ రెడ్డి, బలరాం రెడ్డి, భాస్కర్, లక్ష్మీ శ్యామ్ సుందర్ గౌడ్, తిరుపతి రెడ్డి, కృష్ణ గౌడ్, కిరణ్ కుమార్ రెడ్డి, రమేష్, మండల అధ్యక్షులు సర్సప్ప, చంద్రశేఖర్, కిరణ్, జయానంద్ రెడ్డి, సర్పంచులు నర్సమ్మ, వెంకటేష్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

– రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.