రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం :మంత్రి సుభాష్
చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావుతో పాటు కూటమి అభ్యర్థులను గెలిపించండి :మంత్రి సుభాష్
రామచంద్రపురం, మేజర్ న్యూస్ :రామచంద్రపురం పట్టణాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కూటమి నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం పట్టణంలోని 9, 24వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి మేడిశెట్టి శేషారావుతో పాటు 9వ వార్డు అభ్యర్థి చిక్కం రామ శ్రీనివాసరావు, 24వ వార్డు అభ్యర్థి కొండపల్లి విశ్వతేజకు మద్దతుగా ప్రజలను కలుసుకున్నారు.
ప్రజలతో నేరుగా మమేకమవుతూ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. పట్టణ ప్రగతి, ప్రజా సంక్షేమం కొనసాగేందుకు కూటమి అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఆర్థిక ఇబ్బందుల నుంచి అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం -మంత్రి సుభాష్
ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకురావడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు, రహదారుల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనపై మంత్రి సుభాష్ విమర్శలు గుప్పించారు. అభివృద్ధి కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా రాష్ట్రాన్ని పలు రంగాల్లో వెనక్కి నెట్టారని ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, కీలక ప్రాజెక్టులు ఎంతో అవసరమని, వాటిని వేగవంతం చేయడం ద్వారానే భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు.
మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి మేడిశెట్టి శేషారావు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంతో పాటు పట్టణంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనించాలని కోరారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజారోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల అమలులో మంత్రి చేస్తున్న కృషిని పరిశీలించి ఓటు వెయ్యాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ అభివృద్ధిని నిరంతర ప్రక్రియగా కొనసాగించేందుకు స్థానిక సంస్థల్లో ప్రజల సమస్యలపై అవగాహన కలిగిన ప్రతినిధులు అవసరమని పేర్కొన్నారు. చైర్మన్ అభ్యర్థిగా తనకు, 9వ వార్డు అభ్యర్థి చిక్కం రామ శ్రీనివాసరావుకు, 24వ వార్డు అభ్యర్థి కొండపల్లి విశ్వతేజకు ప్రజలు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. 9, 24వ వార్డుల్లో సాగిన ప్రచారంలో మంత్రి సుభాష్, మేడిశెట్టి శేషారావు, ఇతర కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు నారపు రెడ్డి బలరాం, కంచుమర్తి బాబురావు, గణేష్ శర్మ, పోలిశెట్టి శ్రీనివాస్, కొండ్రెడ్డి శ్రీనివాసరావు, తాళాబత్తుల మురళి, బ్రహ్మం, వైట్ల ప్రకాష్, దత్తు తదితరులతో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.