telangana
కరువు పరిస్థితుల్లో రైతు కుటుంబాలను వేధించడం సరికాదు - మాజీ మంత్రి జోగు రామన్న.
సూర్య ఆదిలాబాద్ : కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని డీసీసీబీ బ్యాంకు అధికారులు రుణాల వసూళ్ల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ఎల్నినో ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, బ్యాంకు అధికారులు రైతు కుటుంబాల ఇళ్లకు వెళ్లి రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. బ్యాంకు అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు.బుధవారం జిల్లా బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో జిల్లా రైతాంగం పంటలను పూర్తిగా నష్టపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరువు ప్రాంతంగా ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు రైతు కుటుంబాలకు ఎలాంటి నష్టపరిహారం అందించకపోవడం విచారకరమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, బ్యాంకుల ద్వారా రుణాల వసూళ్లకు ఒత్తిడి చేయించడం తగదన్నారు.ఒకవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకు అధికారులతో చర్చలు జరుపుతుండగా, మరోవైపు రైతులను రుణాలు చెల్లించాలంటూ వేధించడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్ర రైతులు సైతం తెలంగాణలో పత్తి విక్రయించుకునే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కానీ నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా విదేశాల నుంచి పత్తి దిగుమతులు పెరిగి తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పత్తి, సోయా పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున, ఇతర పంటలకు రూ.20 వేల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ప్రకటించి, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అందించిన రూ.10 వేల పంట నష్టపరిహారాన్ని విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకంటే ఎక్కువ పరిహారం ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిందని మండిపడ్డారు.జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళ్తామని తెలిపారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా రైతుల సమస్యలపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించారు. జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే వారికి అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు రాజకీయాల్లో మునిగితేలడం వారి చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోందని జోగు రామన్న విమర్శించారు.ఈ సమావేశంలో యూనిస్ అక్బని, గంగారెడ్డి, దేవన్న, సేవ్వా జగదీష్, బట్టు సతీష్, కొముర రాజు, అప్కామ్ గంగయ్య, దయానంద్, కడప తిరుపతి, దివిటి రాజు, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.