ముంద్రా ప్లాంట్ పునరుద్ధరణ, సోలార్ వ్యాపారంతో భారీ లాభాలు
సూర్య బిజినెస్ డెస్క్: దేశీయ విద్యుత్ రంగ దిగ్గజం టాటా పవర్ అద్భుతమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం దాదాపు 49 శాతం ఎగబాకింది. గుజరాత్‌లోని ముంద్రా ప్లాంట్ పునరుద్ధరణ కార్యకలాపాలు ప్రారంభం కావడం మరియు పునరుత్పాదక ఇంధన రంగం నుంచి లభించిన బలమైన మద్దతు ఈ వృద్ధికి ప్రధాన కారణమని కంపెనీ వెల్లడించింది.
సమీక్షా త్రైమాసికంలో టాటా పవర్ నికర లాభం రూ. 1,366 కోట్లకు చేరుకున్నట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 919 కోట్లుగా నమోదైంది. అదేవిధంగా కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 26.3 శాతం వృద్ధితో రూ. 19,636 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ. 15,545 కోట్లుగా ఉండేది. కంపెనీ నిర్వహణ లాభం (ఈబిడబ్ల్యూటిఏ) కూడా 11 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 3,667 కోట్లకు చేరింది.
ముంద్రాలో ఉన్న భారీ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం మళ్లీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించడం థర్మల్ విభాగం పనితీరును మెరుగుపరిచింది. మరోవైపు సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ మరియు రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్ట్‌ల దూకుడు కారణంగా పునరుత్పాదక ఇంధన వ్యాపారం కూడా స్థిరమైన వృద్ధిని కనబరిచింది. దేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు కంపెనీ గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతుండటం భవిష్యత్తులో మరింత లాభాలను తెచ్చిపెడుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.