ల్యాండ్ పూలింగ్‌తో ప్రాంత అభివృద్ధికి కొత్త రూపు:కీసర ఆర్డీవో నల్ల వెంకటరెడ్డి
ఘట్‌కేసర్ రూరల్, మేజర్ న్యూస్ : ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించిన భూములను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి, అత్యాధునిక మౌలిక వసతులతో కూడిన లేఅవుట్లుగా తీర్చిదిద్దనున్నట్లు కీసర ఆర్డీవో నల్ల వెంకటరెడ్డి వెల్లడించారు. ఈ ప్రాంతంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలతో భవిష్యత్తులో సమగ్ర ప్రగతికి అవకాశాలు ఏర్పడనున్నాయని పేర్కొన్నారు. బుధవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని ప్రతాపసింగారం రైతువేదికలో ప్రతాపసింగారం, ముత్వెల్లిగూడ, కాచవానిసింగారం గ్రామాల రైతులతో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొని పథకం వివరాలను వెల్లడించారు. మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు కోసం ఈ ప్రాంతంలో సుమారు రూ.6,600 కోట్లు కేటాయించినట్లు ఆర్డీవో తెలిపారు. ఈ నేపథ్యంలో ఘట్‌కేసర్ రెవెన్యూ మండల పరిధిలో ల్యాండ్ పూలింగ్ పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలతో పాటు బహుళ ప్రయోజనాలకు అనువైన ప్లాట్లతో లేఅవుట్లను రూపొందిస్తామని వివరించారు. పట్టా భూములకు సంబంధించి ఎఫ్‌టీఎల్ పరిధిలో ఎకరానికి 400 గజాలు, బఫర్ జోన్‌లో 800 గజాలు, మిగిలిన భూములకు 1,400 గజాలు లేదా అభివృద్ధి అనంతరం 50:50 నిష్పత్తిలో ఏది తక్కువైతే ఆ మేరకు ప్లాట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆక్రమణ భూములకు ఎకరానికి 300 గజాల చొప్పున కేటాయించనున్నట్లు తెలిపారు. గురువారం నుంచి 500 మీటర్ల పరిధిలో భూముల హద్దుల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు.ప్రభుత్వ ప్రతిపాదనలపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అనే తేడా లేకుండా అందరికీ సమాన ప్రాతిపదికన ప్లాట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పట్టాదారులకు దక్కే వాటాను పెంచాలని కోరారు. లేఅవుట్ల అభివృద్ధికి నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించడంతో పాటు నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయకపోతే నష్టపరిహారం చెల్లించేలా హామీ ఇవ్వాలని అధికారులను కోరారు. సమావేశంలో ఘట్‌కేసర్ తహసీల్దార్ చంద్రశేఖర్, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, ఆర్‌ఐలు సాయిరాం, కావ్య, రెవెన్యూ అధికారులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.