విద్యార్థులకు కుంగ్ ఫూ, కరాటేలో ప్రత్యేక శిక్షణ
జిన్నారం : జిన్నారం మున్సిపల్ పరిధిలోని కొడకంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కుంగ్ ఫూ, కరాటేలో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ఆపద సమయంలో తమను తాము రక్షించుకునే నైపుణ్యాలను నేర్పించడమే లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి వారం మూడు రోజుల పాటు సోమవారం, బుధవారం, శనివారం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణలో భాగంగా ఆత్మరక్షణకు సంబంధించిన వివిధ పద్ధతులను నేర్పిస్తూ శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, మానసిక ధైర్యాన్ని పెంపొందించేలా తర్ఫీదు ఇస్తున్నారు. చిన్న వయస్సు నుంచే విద్యార్థులకు ఆత్మరక్షణ నైపుణ్యాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కరాటే మాస్టర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.